: సమగ్ర సర్వే వెనుక తెలంగాణ సర్కారు దురాలోచన: గంటా
ఒక్కరోజులోనే సమగ్ర సర్వే జరపాలని తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక దురాలోచన దాగి ఉందంటున్నారు ఆంధ్రా మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో నివాసముంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయడమే వారి ముఖ్యోద్దేశం అని ఆరోపించారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీఎం పదవికి మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ సర్వేలో ప్రజలను పలు విధాలా ప్రశ్నిస్తారని గంటా వివరించారు. ఏ సంవత్సరంలో తెలంగాణకు వచ్చారని అడుగుతారని, ప్రజలు చెప్పే జవాబును బట్టి వారికి స్థానికత కార్డు అందిస్తారని తెలిపారు. అయితే, తాము సర్వేను వ్యతిరేకించడంలేదని, సర్వేలో వినియోగించనున్న ఫారంలోని పలు అంశాల పట్ల అభ్యంతరం చెబుతున్నామని గంటా అన్నారు. విశాఖలో ఈ సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.