: జగన్ పై విమర్శల దాడి తగదు: వైఎస్సార్సీపీ
టీడీపీ నేతలు తమ పార్టీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. రుణమాఫీ చేయలేక జగన్ పై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత పార్ధసారథి మండిపడ్డారు. ఇచ్చిన హామీ అమల్లో పెట్టలేక ప్రతిపక్షంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆర్బీఐకి నివేదికలు పంపుతున్నారన్న ఆరోపణలను దేవినేని ఉమ నిరూపించగలరా? అని పార్ధసారథి సవాల్ విసిరారు. ఆర్బీఐపై నెపం మోపి రుణమాఫీ నుంచి తప్పుకోజూడడం తగదని, ఈ విషయంలో బీజేపీని ఎందుకు నిలదీయరని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం జగన్ దిష్టిబొమ్మల దహనానికి 'చంద్రదండు' ఏర్పాటును తాము ఖండిస్తున్నట్టు తెలిపారు.