: సంజయ్ దత్ ఉత్తరాన్ని చదవి కన్నీళ్ళు పెట్టిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ లో స్నేహానికి పర్యాయపదంలా నిలిచేవాళ్ళలో సంజయ్ దత్, అజయ్ దేవగణ్ కూడా వస్తారు. ప్రస్తుతం సంజయ్ జైల్లో ఉండగా, అజయ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముంబయి వరుస పేలుళ్ళ కేసులో సంజూకు సుప్రీం శిక్ష ఖరారు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో పూణేలోని యెరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవలే మిత్రుడి నుంచి అజయ్ కి ఓ లేఖ వచ్చింది. అది చదివిన వెంటనే కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు ఈ యాక్షన్ హీరో. అనంతరం, కన్నీటిపర్యంతమయ్యాడట. వ్యక్తిగత అంశాల దృష్ట్యా ఉత్తరంలో రాసిన కొన్ని విషయాలను అజయ్ వెల్లడించలేదు. అయితే, జైల్లో 11 కిలోల బరువు తగ్గానని సంజయ్ పేర్కొనడం పట్ల ఈ 'సింగం' హర్షం వ్యక్తం చేశాడు. జైల్లో కఠోర వ్యాయామం చేస్తున్నట్టు సంజూ తెలిపాడట. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, "విడుదల సందర్భంగా చొక్కా లేకుండా, ఎయిట్ ప్యాక్ బాడీతో బయటికొస్తాడేమో" అని చమత్కరించాడు. బాలీవుడ్ లో చెత్త డ్యాన్సర్లని ఈ మిత్రులిద్దరికీ మంచి పేరుంది! ఆ సంగతి వీళ్ళిద్దరికీ తెలుసు. అందుకు నిదర్శనంలా... "నీ డ్యాన్సు మెరుగైందా?" అంటూ తన లేఖలో వాకబు చేశాడట సంజూ. 2008లో మెహబూబా సినిమాలో తాము చేసిన డ్యాన్సులను గుర్తు చేశాడని అజయ్ చెప్పాడు. అంతేగాకుండా, తాజా సినిమా సింగం రిటర్న్స్ హిట్టవ్వాలని ఆకాంక్షించాడట తన లేఖలో సంజయ్. కాగా, అజయ్ ని సంజూ 'రాజు' అని పిలుస్తాడట. రాజు అనేది అజయ్ దేవగణ్ ముద్దుపేరు. అన్నట్టు... సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్, అజయ్ తండ్రి వీరూ దేవగణ్ కూడా ఆప్తమిత్రులట.