: భర్త చూస్తుండగానే మహిళను నోటకరుచుకెళ్ళింది!
పశ్చిమబెంగాల్లోని సుందర్ బన్స్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్త చూస్తుండగానే ఓ పెద్దపులి నోటకరుచుకెళ్ళింది. వివరాల్లోకెళితే... దయాపూర్ గ్రామంలో నివసించే భగవతి మోండాల్, సునీల్ మోండాల్ దంపతులు. వారు మత్స్యకార వర్గానికి చెందినవారు. రోజూ చేపలో, పీతలో పట్టుకుని వాటినమ్ముకుని బతుకు వెళ్ళదీస్తుంటారు. ఎప్పటిలాగే పడవలో సుందర్ బన్స్ వద్ద వేట సాగిస్తున్నారు. ఆ రోజు వారితో పాటు పొరుగు వ్యక్తి పరిమళ్ మృదా కూడా వచ్చాడు. అయితే, ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. ఏదో పిడుగు పడి ఉంటుందని వారు భావించారు. ఆ సమయంలో పడవ కూడా కుదుపులకు లోనైంది. కానీ, పడవ మధ్య భాగంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పెద్దపులిని చూసేసరికి వారికి విషయం బోధపడింది. వారలా నిశ్చేష్టులై చూస్తుండగానే, ఆ పులి భగవతిని నోటకరుచుకుని సమీపంలోని మడ అడవుల్లోకి లాక్కెళ్ళింది. ఒక్క గెంతులో అది అక్కడి నుంచి మాయమవడంతో భగవతి భర్త సునీల్, పరిమళ్ నిస్సహాయుల్లా మిగిలిపోయారు. తాము సేకరించిన పీతలు ఏమూలకూ రావని భావించిన వారు ఆ జలాల్లో మరికొంత దూరం ముందుకెళ్ళి వేటాడాలని భావించడమే ఈ విషాదానికి కారణమైంది. ఈ విషయమై స్థానిక స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి పవిత్ర మోండాల్ మాట్లాడుతూ, ఘటనపై అటవీశాఖను నష్టపరిహారం కోరామని, వారు మంజూరు చేశారని తెలిపారు.