: నాలుగో టెస్ట్ లో భారత్ ఘోరపరాజయం... మూడు రోజుల్లో ఖేల్ ఖతం
భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బౌలర్లకు సహకరించే పిచ్‌లపై దారుణంగా విఫలమవుతుందని మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి పాలుకావడం భారత్ బ్యాట్స్‌మెన్ వైఫల్యాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఈ ఘన విజయంతో, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టి, శుక్రవారం వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో జో రూట్ (77), జోస్ బట్లర్ (70) అర్ధశతకాలతో రాణించారు. రెండో ఇన్నింగ్స్ లో వరుణ్ అరోన్ వేసిన ఓ షార్ట్ పిచ్ బాల్ దెబ్బకు స్టువర్ట్ బ్రాడ్ ముక్కుకు తీవ్రంగా గాయమైంది. దీంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగిన బ్రాడ్ మళ్లీ బ్యాటింగ్ కు రాలేదు. తొలి ఇన్నింగ్స్ లో బ్రాడ్ దెబ్బకు 46.4 ఓవర్లలోనే కుప్పకూలిన భారత బ్యాట్స్‌మెన్... రెండో ఇన్నింగ్స్‌లో అతను లేని లోటును ఇంగ్లండ్‌కు ఏమాత్రం తెలియనీయకుండా 43 ఓవర్లలో 161 పరుగులకే దాసోహమన్నారు. 215 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కనీసం మూడో రోజు కూడా పూర్తవకముందే గంపగుత్తగా మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేతిలో పెట్టేసింది. ఓపెనర్లు విజయ్ (18), గంభీర్ (18)తో పాటు ధోనీ (27) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇక బోలెడన్ని ఆశలు పెట్టుకున్న పుజారా (17), కోహ్లీ (7), రహానె (1), జడేజా (4) నిర్లక్ష్యంగా ఆడి వికెట్ సమర్పించుకున్నారు. అశ్విన్ (46 నాటౌట్) జట్టులో టాప్ స్కోరర్. మూడో టెస్ట్‌లో టీమిండియా నడ్డి విరిచిన మొయిన్ అలీ (4/39) మరో సారి భారత్ పతనాన్ని శాసించాడు. అండర్సన్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన బ్రాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.