: మా మీద కేంద్రం పెత్తనమేంది? కేంద్ర ప్రభుత్వానికి బెదిరేది లేదు: తెలంగాణ ఎంఎస్ఓలు
తెలంగాణ ఎంఎస్ఓలు కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. ఏబీఎన్, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ ఎంఎస్ఓలు నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రప్రభుత్వ వైఖరి మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమ మీద కేంద్రం పెత్తనం సహించేది లేదని ఎంఎస్ఓలు వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఏ మాత్రం బెదరమని... ఈ విషయంలో చావుకు కూడా వెనుకాడమని తెలంగాణ ఎంఎస్ఓలు స్పష్టం చేశారు. ప్రజలు కోరుకోని ఛానళ్లను తాము చూపించమని... తమను ఈ విషయంలో భయభ్రాంతుల్ని చేయాలని కేంద్రం అనుకుంటే మరో ఉద్యమం తప్పదని ఎంఎస్ఓలు కేంద్రాన్ని హెచ్చరించారు. డీటీహెచ్ లు వారికి నచ్చిన ఛానల్స్ ప్రసారం చేస్తే ఏనాడు నోరుమెదపని కేంద్రప్రభుత్వం... ఇప్పుడు తమ విషయంలో మాత్రం ఎందుకు నిర్బంధం విధిస్తున్నదని వారు నిలదీశారు. సోమవారం మరోసారి సమావేశమై... భవిష్యత్తు వ్యూహాలను రూపొందించుకోవాలని నిర్ణయించారు.