: దుమారం రేపుతున్న సరోగసీ...పిల్లలను వదిలేసిపోతున్న తండ్రులు!
థాయ్ లాండ్ లో సరోగసీ (అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనడం) విధానంపై పెనుదుమారం రేగుతోంది. సరోగసీ ద్వారా పిల్లల్ని పొందిన తండ్రులు తమ పసివాళ్లకు ఏ సమస్య తలెత్తినా వారిని, భార్యను వదిలేసి పోతున్నారు. దీంతో సరోగసీ విధానంపై విమర్శలు విన్పిస్తున్నాయి. ధాయ్ లాండ్ ఆర్ధికంగా వెనుకబడి ఉండడం వల్ల, పిల్లల్ని కనిస్తే తమకు అంతో ఇంతో వస్తుందన్న ఉద్దేశంతో అక్కడి మహిళలు ఈ సరోగసీని ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు, థాయ్ లాండ్ చట్టాలు అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనేందుకు సులువుగా ఉండడంతో ధనికులు సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా, సరోగసీ విధానం ద్వారా కన్న పిల్లలు అనాధలుగా మారుతుండడంపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. జపాన్ కు చెందిన 24 ఏళ్ల వ్యాపారవేత్త 9 మంది బిడ్డలకు తండ్రికావడం కలకలం రేపుతుండగా, చివరి బిడ్డకు వ్యాధి సోకిందనే కారణంగా పుట్టిన బిడ్డను వదిలేసి దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఆ బిడ్డ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోచోట ఆస్ట్రేలియా జంటకు సరోగసీ ద్వారా జన్మించిన పసిబిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ సోకిందంటూ వదిలేశారు. ఇప్పుడా బిడ్డ దిక్కులేనిదిగా మిగిలింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. సరోగసీ విధానం మంచిది కాదని, దాని ద్వారా బిడ్డను కన్న తల్లులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని, భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అదీగాక సరోగేట్ తల్లిదండ్రులు పసివారిని వదిలేసినా ప్రమాదమేనని, దీనిపై చట్టాలు మరింత కఠినంగా తయారు చేయడమే కాకుండా, అమలు కూడా చేయాలని వారు సూచిస్తున్నారు.