: అనాగరిక తెగను ప్రపంచానికి చూపిన క్రికెట్ మ్యాచ్
క్రికెట్ ఓ దేశంలో మతం, మరో దేశానికి జాతీయ క్రీడ. ప్రపంచానికి అత్యంత సంపన్నమైన మూడో క్రీడ. అలాంటి క్రికెట్ అత్యంత అనాగరిక జాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆఫ్రికా నుంచి వలస వచ్చి... కెన్యాలోని లైకిపియా ప్రాంతంలో స్థిరపడిన తెగ మాసాయ్. వీరు నాగరిక ప్రపంచానికి దూరంగా శతాబ్దాలుగా బతుకీడుస్తున్నారు. శరీరంలో కొంత భాగం వస్త్రంతో, మిగిలిన భాగాన్ని పూసలను ఉపయోగించి కప్పుకునే మాసాయ్ తెగ ప్రజలు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాంటి మాసాయ్ తెగ ప్రజలు తమ గురించి ప్రపంచానికి చాటేందుకు క్రికెట్ ను ఎంచుకున్నారు. దుర్భరమైన తమ జీవన విధానంపై ప్రపంచం దృష్టి పడేలా చేసి సఫలీకృతమయ్యారు 'మసాయ్ వారియర్స్'. లార్డ్స్ లోని నర్సరీ గ్రౌండ్ లో లాస్ట్ మ్యాన్ ఆఫ్ స్టాండ్స్ ప్రపంచ ఛాపింయన్ షిప్ లో ఆడేందుకు 'మాసాయ్ వారియర్స్'కు అవకాశమిచ్చి తన గొప్పమనసును చాటుకుంది ఐసీసీ. చేతిలోని ఈటెల్ని పక్కన పెట్టి, బ్యాట్లు పట్టుకున్న మసాయన్లు ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. విచిత్రమైన ఆహార్యం, సాధారణమైన చెప్పులు, కటికి కట్టుకున్న ఎర్ర వస్త్రం, ఒంటిని కప్పుకునేందుకు వాడిన ధవళ వస్త్రం, రంగు రంగుల తాళ్లు, పూసలతో తలకు చిత్రమైన పూసల అలంకరణతో ప్యాడ్లు, గ్లౌజులు ధరించిన మసాయన్లను ప్రపంచం మొత్తం గమనించింది. క్రికెట్ లో తమ స్థాయి ఏమిటన్నది పక్కన పెడితే... ఒక్క ఆటతో చీకట్లను చీల్చారు 'మసాయ్ వారియర్స్'. వారి జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు చాలా సంస్థలు పోటీ పడుతుండగా, స్వచ్ఛంద సంస్థలు వీరికి వస్తు, వస్త్ర, వైద్య సదుపాయం కల్పించేందుకు పయనమయ్యాయి. భవిష్యత్ తరాలు నాగరిక ప్రపంచంతో కలవాలని మసాయన్లు ఎన్నుకున్న క్రికెట్ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం.