: నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీకి విదేశీ పర్యాటకులు తగ్గారట!


రెండేళ్ల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటన తర్వాత, ఆ నగరానికి వచ్చేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపడం లేదట. భారత పురావస్తు శాఖ గణాంకాలతో నిగ్గు తేల్చిన వాస్తవమిది. భారత ప్రాచీన సంస్కృతులకు తార్కాణంగా నిలిచే విలువైన కట్టడాలకు ఢిల్లీ వేదికగా నిలుస్తోంది. కుతుబ్ మినార్, హుమాయూన్ టూమ్స్, ఎర్రకోట ఈ జాబితాలో అగ్రభాగాన నిలుస్తున్నాయి. విదేశీ పర్యాటకులు కూడా వీటిని తప్పనిసరిగా సందర్శిస్తున్నారు. అయితే నిర్భయ ఘటన తర్వాత వీటిని సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ పర్యాటకుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోందని పురావస్తు శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హుమాయూన్ టూమ్స్ ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 2011తో పోల్చితే, 2012 నాటికి రెట్టింపు కాగా, 2013 లో ఒకేసారి 30 శాతం పడిపోయింది. అలాగే 2011లో కుతుబ్ మినార్ ను 30 లక్షల మంది సందర్శిస్తే, 2012 నాటికి ఈ సంఖ్య 35 లక్షలకు చేరింది. అయితే 2013లో ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించిన వారి సంఖ్య 32 లక్షలకు పడిపోయింది. ఈ మూడు చారిత్రక కట్టడాలకే కాక ఢిల్లీలో జంతర్ మంతర్, పురానా ఖిల్లా తదితర పర్యాటక ప్రదేశాలను కూడా ఇదే పరిస్థితి వేధిస్తోందట. వచ్చే ఏడాది న్యూఢిల్లీని ‘వరల్డ్ హెరిటేజ్ సిటీ’గా యూనెస్కో ప్రకటించనుంది. దీనిపై ఈ ప్రభావం ఏ మేరకు పడనుందన్న అంచనాలపై పురావస్తు శాఖ తర్జనభర్జన పడుతోంది.

  • Loading...

More Telugu News