: మోతీలాల్ వోరా ‘హస్త’ లాఘవం!
కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు మోతీలాల్ వోరా హస్త లాఘవానికి సంబంధించిన ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది. రాజ్యసభ సభ్యుడి హోదాలో వోరా, ఏకంగా తొమ్మిది ప్రభుత్వ బంగళాలను తన పేరిట దక్కించుకుని, వాటిని అద్దెకిచ్చేసి బాగానే ఆర్జిస్తున్న వైనం సమాచార హక్కు చట్టం పుణ్యమాని వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో సొంత పార్టీ వారికి నిబంధనలను తుంగలో తొక్కేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నిర్వాకమూ బయటపడింది. సాధారణంగా ఎంపీలకు దేశ రాజధానిలో ప్రభుత్వ బంగళా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా కోశాధికారి హోదాలో కొనసాగుతున్న వోరా అభ్యర్థనకు యూపీఏ సర్కారు ముందు, వెనుకా చూడకుండా తన అబ్బసొత్తన్నట్లు తలాడించేసిన వైనంపై అన్ని రాజకీయ పార్టీలు ముక్కున వేలేసుకుంటున్నాయి. అయినా తొమ్మిది ప్రభుత్వ బంగళాలను వోరా మాత్రం ఏం చేసుకుంటారనేగా మీ అనుమానం. ఎంచక్కా న్యూఢిల్లీ నడి వీధుల్లో నివాసముండాలని కలలు గనే రాజకీయ నేతలకు వీటిని వోరా అద్దెకు ఇచ్చేశారట. నెలనెలా అందుతున్న అద్దెలను గుంభనంగా జేబులో వేసేసుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరిన చోట అద్దెకు దొరికే బంగళాలను ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి, అందుకేనేమో వోరా ఆఫర్లకు భారీ డిమాండే వెల్లువెత్తిందట. సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి చేసిన దరఖాస్తుకు సమాధానంగా రాజ్యసభ సెక్రటేరియట్ ఈ సమాచారాన్ని వెల్లడి చేయక తప్పలేదు. అలాంటిదేమీ లేదే అంటూ ఈ సమాచారంపై వోరా స్పందించారట. తీరా మీడియా సదరు బంగళాల వద్దకెళ్లి పరిశీలించగా, ఈ బంగళాలు వోరా చేతిలో్నే ఉన్నాయని అక్కడి వారు చెప్పారు.