: నేడు బీజేపీ జాతీయ కౌన్సిల్ భేటీ


భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ నేడు న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుంది. పార్టీ ముఖ్య నేతలతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే ఈ భేటీలో ఇటీవలే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా నియామకానికి ఆమోద ముద్ర లభించనుంది. గత నెలలో పార్టీ అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్ స్థానంలో అమిత్ షా పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకానికి జాతీయ కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ కౌన్సిల్ భేటీలో, పార్టీతో పాటు ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ కొనసాగనుంది. మరోవైపు అమిత్ షా, తన నియామకానికి సంబంధించి కౌన్సిల్ ఆమోదం తెలపగానే, కొత్త కార్యవర్గంపై దృష్టి సారించనున్నారు. 50 ఏళ్ల అమిత్ షా కొత్త కార్యవర్గంలో యువతకు పెద్దపీట లభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ఆరెస్సెస్ నుంచి పార్టీలో చేరిన రాంమాధవ్ తరహా నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ అమిత్ షా కొత్త కార్యవర్గంలో కూడా మోడీ ముద్ర స్పష్టంగా కనిపించనుందని కూడా ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News