: భార్య విడాకులిచ్చిందన్న కక్షతో 'ఫేస్ బుక్'లో అసభ్యకర చిత్రాలు పెట్టిన ప్రబుద్ధుడు


విడాకులిచ్చిందన్న కక్షతో ఓ వ్యక్తి తన మాజీ భార్యపై హైటెక్ పద్ధతుల్లో వేధింపులకు దిగాడు. ఆమె అసభ్యకర చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టడమే కాకుండా, ఆమె కుటుంబ సభ్యులను ఫోన్లో బెదిరించి, చివరికి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జమ్మూకాశ్మీర్ కు చెందిన అశ్వాక్(38) నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. శామీర్‌పేట్‌లోని ఐవీ లీగ్ అకాడమీ రెసిడెన్సియల్ స్కూల్‌లో ఎస్టేట్ మేనేజర్‌గా ఉంటూ, 3 మార్చి 2013న ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో కాపురం పెట్టారు. శామీర్‌పేటలోనే ఉండాలనేది అశ్వాక్ ఆలోచన. ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు చోటుచేసుకునేవి. దీంతో ఆమెపై పలు ఆరోపణలు చేసిన అశ్వాక్, ఆమెను అత్తాపూర్ లో వదిలి శామీర్‌పేటకు మకాం మార్చాడు. అశ్వాక్ తీరుతో విసిగిపోయిన అతని భార్య వరంగల్ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టుకుంది. న్యాయస్థానానికి అశ్వాక్ గైర్హాజరవడంతో కోర్టు ఆమెకి విడాకులు మంజూరు చేసింది. దీంతో అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు. షకీలా అనే పేరిట తప్పుడు చిరునామాతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. మాజీ భార్యకు చెందిన చిత్రాలను అందులో అప్‌లోడ్ చేశాడు. ఫేక్ ఐడీతో సిమ్‌కార్డులు తీసుకొని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వేధించడం, అసభ్యకర మెసేజ్ లు పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో విసిగిపోయిన ఆమె సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. తనకు విడాకులు ఇచ్చిందన్న కక్షతోనే తన భార్యను వేధిస్తున్నట్టు అశ్వాంక్ పోలీసుల ముందు అంగీకరించాడు.

  • Loading...

More Telugu News