: 19న అందరూ ఇండ్ల దగ్గర ఉండాల్సిందే... సాకుల్లేవ్: రేమండ్ పీటర్


సమగ్ర సర్వేకు, స్థానికతకు సంబంధం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19న తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించి తీరుతామని అన్నారు. సర్వేపై ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదని ఆయన తెలిపారు. సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వే రోజు ఇంటి వద్ద లేని కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చే అవకాశం లేదని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధారాలు చూపే అవకాశం కల్పించామని అన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన ఆధారాలు సర్వే సిబ్బందికి చూపించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఎక్కడ నివాసం ఉంటున్నవారు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. సర్వేకు సంబంధించిన ప్రత్యేక వెబ్ సైట్ ను నేడు (శనివారం) రూపొందిస్తామని ఆయన తెలిపారు. సర్వేకు సంబంధించిన ఫార్మాట్ ఇంకా సిద్ధం కాలేదని, మరో రెండు రోజుల్లో అంతా సిద్ధం అయిపోతుందని ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు తప్పుడు సమాచారం ఇస్తే దానికి వారే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోని వ్యక్తులు వచ్చిపోయేందుకు ఎలాంటి రవాణా సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయదని ఆయన తెలిపారు. సర్వే అనంతరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాష్ట్రంలో స్థిరపడే వారికి కార్డులు కల్పించే విషయం పరిశీలిస్తున్నామని, రేషన్ కార్డులు తొలగించడానికే సర్వే అనే ప్రచారంలో అర్థం లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News