: విశాఖపట్నం సిటీని మరో ముంబయిగా మారుస్తా: చంద్రబాబు
విశాఖపట్నం సిటీని మరో ముంబయిగా మారుస్తానని చంద్రబాబు అన్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే... చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాడేరులో పండే కాఫీ ప్రపంచంలోనే బ్రహ్మాండంగా ఉందన్నారు. విశాఖ జిల్లాలో లక్షా 30 వేల మంది మత్స్యకారులు ఉన్నారని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి పట్టణానికి, గ్రామానికి మంచినీరు అందిస్తామన్నారు. అన్ని పారిశ్రామికవాడల్ని కలుపుతూ నీటి పైపులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.