: సచిన్, రేఖల గైర్హాజరుపై రాజ్యసభలో సభ్యుల అసంతృప్తి
క్రికెటర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ రాజ్యసభకు గైర్హాజరు అయిన అంశాన్ని పలువురు సభ్యులు సభలో లేవనెత్తారు. సభలో వారిద్దరి అటెండెన్స్ చాలా దారుణంగా ఉందని, ఈ తీరు అంగీకరించదగినది కాదని వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఐ సభ్యుడు పి.రాజీవ్ మాట్లాడుతూ, సచిన్ కేవలం రాజ్యసభకు మూడు రోజులు మాత్రమే హాజరయ్యారని, రేఖ కేవలం ఏడు రోజులే వచ్చారని తెలిపారు. కాగా, ఓ నిబంధన ప్రకారం ఒక రాజ్యసభ సభ్యుడు అరవై రోజుల పాటు సభకు హాజరుకాకుంటే అతని సీటు ఖాళీగా ఉందని ప్రకటించవచ్చని ఉటంకించారు. దీనిపై డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సమాధానమిస్తూ... సచిన్, రేఖలు నలభై రోజుల కంటే తక్కువగా హాజరయ్యారు కాబట్టి, వారిద్దరూ రాజ్యాంగంలోని ఆ నిబంధనను ఉల్లంఘించలేదని, ఇప్పుడే చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.