: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వం పంపిన ఫైలుకు ఆమోద ముద్ర వేశారు. అంతకుముందు ఈ విషయంపై ఏపీపీఎస్సీకి చెందిన ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశమై చర్చించారు. సాంకేతిక పరమైన అంశాలన్నింటినీ పూర్తి చేశాక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫైలుపై సంతకం చేశారు. కాగా, దీనిపై నేడు లేదా రేపు జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. దాంతో, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు, కొత్త నియామకాలు జరుపుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగినట్లయింది. అటు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ దేవీ ప్రసాద్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ అభినందనీయమన్నారు. ఆయన కృషి ఫలితంగానే ఇంత తొందరగా టీఎస్ పీఎస్సీ ఏర్పాటు అవుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News