: తన కూతురిని తీసుకెళ్ళాడని వేటకత్తికి బలిచేశాడు!


కర్ణాటకలో బీభత్సకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కుమార్తెను తీసుకెళ్ళిన యువకుడిని వేటకత్తికి బలిచేశాడు. అనంతరం ఆ కత్తితో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళితే... బెంగళూరులోని హొంబేగౌడ మురికివాడల్లో రియాజ్ ఖాన్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతని కుమార్తె ఏడవ తరగతి చదువుతోంది. ఆ బాలిక సాదిక్ అనే యువకుడితో రెండేళ్ళుగా సన్నిహితంగా మెలగడం గమనించిన రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని కలవద్దని కుమార్తెను హెచ్చరించాడు. అంతేగాకుండా, అక్కడి నుంచి మకాం కేపీ పురంలోని మసీదు రోడ్డు వద్దకు మార్చాడు. సాదిక్ అక్కడికీ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ యువకుడు జులై 30 రియాజ్ ఖాన్ కుమార్తెను తీసుకెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు బాలిక తన తండ్రికి ఫోన్ చేసి బాగానే ఉన్నానని, సాదిక్ ను పెళ్ళిచేసుకోబోతున్నానని తెలిపింది. ఇది విని రియాజ్ మండిపడ్డాడు. వెంటనే సాదిక్ మిత్రుడు ఇర్ఫాన్ ను కలిసి అతనికి డబ్బు ఎరచూపి, ప్రేమికుల ఆనుపానుల గురించి ఆరా తీశాడు. దీంతో, ఇర్ఫాన్ ఫోన్ చేసి సాదిక్ ను హొంబేగౌడ పిలిచాడు. సాదిక్ అక్కడికి రాగా రియాజ్ అతనితో మంచిగా మాట్లాడి అతని వెంట హొంగదవెనహళ్ళి వెళ్ళాడు. సాదిక్ అక్కడ తన సోదరికి చెందిన ఇంట్లోనే రియాజ్ కుమార్తెను ఉంచాడు. అప్పటికే రియాజ్ మదిలో ప్రణాళిక ప్రాణం పోసుకుంది. ఆ రాత్రికి అక్కడే ఉన్న ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయాన్నే సాదిక్ తో మాట్లాడాలని చెప్పి అందరినీ బయటికి వెళ్ళమని కోరాడు. అనంతరం వారు వెళ్ళగానే, వేటకత్తి బయటికి తీసి విచక్షణ రహితంగా ఆ యువకుడిని నరికి చంపాడు. ఇది చూసి అందరూ బెంబేలెత్తిపోయారు. రియాజ్ మాత్రం తాపీగా ఆ శవాన్ని ఓ గోనెసంచిలో వేసుకుని కేఈర్ పురం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఆ రక్తపుమరకలు, చేతిలో కత్తి చూసిన పోలీసులు విషయాన్ని తేలిగ్గానే గ్రహించారు. దాంతో, అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుంటే తండ్రి ఉగ్రనరసింహావతారం చూసిన ఆ తనయ సంఘటన స్థలం నుంచి పరారయ్యింది. ఇప్పుడామె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News