: రిలయన్స్ లో మూడో తరం ఎంట్రీ!


రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మూడో తరం రంగ ప్రవేశం చేసింది. ముఖేశ్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, కొత్తగా సేవలు ప్రారంభించనున్న రిలయన్స్ జియో బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు అనిల్ అంబానీ కొడుకు జై అన్మోల్ కూడా రిలయన్స్ క్యాపిటల్ లో ఇప్పటికే చేరిపోయారు. ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ లో రెండేళ్ల తేడాతో ముఖేశ్, అనిల్ అంబానీలు చేరారు. తాజాగా వీరి కుమారులిద్దరూ కేవలం నెలల వ్యవధిలో తమ తాత సృష్టించిన వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. అయితే, తమ తండ్రులిద్దరు వ్యాపార రంగ ప్రవేశం చేసిన సమయంలో రిలయన్స్ ఉమ్మడిగానే ఉండగా... రెండు ముక్కలైన రిలయన్స్ లోని రెండు విభాగాల్లోకి మూడో తరం సారథులు అడుగు పెట్టారు. అయితే తమ తండ్రులు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో కీలక విభాగాలకే ఇద్దరూ సారథ్య బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. అంతేకాదండోయ్, వేర్వేరు సంస్థలకు బాధ్యతలు వహిస్తున్నప్పటికీ, వీరిద్దరూ కలిసి పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే, రిలయన్స్ జియోకి రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ చేస్తోంది మరి. మరోవైపు అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్ కామ్ నెట్ వర్క్ ను కూడా రిలయన్స్ జియో వాడుకుంటోంది. ఈ మేరకు సోదరులిద్దరి మధ్యన ఇప్పటికే అవగాహన కుదిరింది. అనిల్ అంబానీ వారసుడు జై అన్మోల్ 'వార్విక్ బిజినెస్ స్కూల్' నుంచి డిగ్రీ పొందారు. ఇతడికి ఫైనాన్స్ రంగంపై ఆసక్తి ఎక్కువ. జై చేరికతో రిలయన్స్ క్యాపిటల్, మరింత బలోపేతమవుతూ వివిధ కంపెనీలను టేకోవర్ చేస్తూ దూసుకెళుతోంది. ఇక ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన ఆకాశ్, రిలయన్స్ జియోను ఏ విధంగా నడిపిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే, ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ, యాలే వర్సిటీ డిగ్రీ అనంతరం కుటుంబ సంప్రదాయానికి భిన్నంగా మెకిన్సేలో కన్సల్టెంట్ గా చేరిపోయారు.

  • Loading...

More Telugu News