: తొలి రోజే కుప్పకూలిన టీంఇండియా... నాలుగో టెస్ట్ లో ఇంగ్లండ్ ఆధిపత్యం
ఇంగ్లండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పేలవ బ్యాటింగ్ తో భారత్ తొలిరోజే పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. స్టువర్ట్ బ్రాడ్ (6/35), జేమ్స్ అండర్సన్ (3/46) విజృంభించడంతో భారత్ 46.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధోనీ (71), అశ్విన్ (40), అజింక్యా రహానె (24) మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోరును సైతం సాధించలేకపోయారు. టాప్ ఆర్డర్ లో మురళీ విజయ్ (0), గౌతమ్ గంభీర్ (4), పుజారా (0), కోహ్లీ (0) మూకుమ్మడిగా చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 35 ఓవర్లలో మూడు వికెట్లకు 113 పరుగులు చేసింది. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి గ్యాలెన్స్(37), జోర్డాన్ (0) క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు వెనకబడి ఉంది.