: రాంచరణ్, నాగచైతన్యలకు కష్టాలు, పేదరికం గురించి తెలుసా?: చిరంజీవి
హీరో నాగార్జున సంధానకర్తగా వ్యవహరించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ఫస్ట్ ఎడిషన్ చివరి ఎపిసోడ్ లో ప్రత్యేక అతిథిగా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో యువతకు సంబంధించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్, నాగచైతన్యలకు కష్టాలు కాని, పేదరికం కానీ తెలుసా? అని ప్రశ్నించారు. తనకు గాని, నాగార్జునకు కాని కష్టాలంటే ఏమిటో తెలుసని... తమ బిడ్డలకు తెలవదని చెప్పారు. తాను స్వయంగా కష్టాలను అనుభవించానని... నాగేశ్వరరావు గారి ద్వారా కష్టాల గురించి నాగార్జున తెలుసుకున్నారని చెప్పారు. ఈ గేమ్ షో ద్వారా సమాజంలోని కష్టాలను, పేదరికాన్ని ప్రపంచానికి చూపించగలిగారని చిరంజీవి కొనియాడారు. ఈ కార్యక్రమం మనసును హత్తుకునేలా ఉందని... ఎంతో మందిని టచ్ చేసిందని తెలిపారు. పేదరికం గురించి తెలియని మెట్రో యువతకు కనువిప్పు కలిగేలా ఈ కార్యక్రమం ఉందని కొనియాడారు. చివరి ఎపిసోడ్ లో పాల్గొనే అవకాశం తనకు ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, హాట్ సీట్ లో కూర్చున్న చిరంజీవి గేమ్ ఆడుతారని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది.