: కేవలం 74 వేలకు దేశ రహస్యాలు అమ్మేశాడు!


సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సుబేదార్ మేజర్ గా పని చేస్తున్న పతన్ కుమార్ పొద్దార్ భారత సైనికుల రహస్యాలను కేవలం 74 వేల రూపాయలకు అమ్మేయడం సంచలనం సృష్టిస్తోంది. సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో శారీరక బలహీనతకు లొంగిపోయి ఆర్మీకి సంబంధించిన సమాచారం అందజేసినట్టు ఒప్పుకున్నాడు. అందుకు ప్రతిగా 74 వేల రూపాయలు అందుకున్నట్టు కూడా అంగీకరించాడు. కేవలం డబ్బుకోసమే పొద్దార్ ఈ పని చేశాడా? అంటే, అతను మల్టీలెవెల్ మార్కెటింగ్ వ్యాపారంలో ఉండడం విశేషం. 2013లో ఫేస్ బుక్ లో పరిచయమైన అనుష్క అగర్వాల్ అనే మహిళ తాను ఆర్మీ అధికారి కుమార్తెనని చెప్పి పొద్దార్ తో పరిచయం పెంచుకుంది. తాను పీహెచ్ డీ చేస్తున్నానని, అందులో భాగంగా ఆర్మీకి సంబంధించిన సమాచారం కావాలని ఆమె కోరడానికి తోడు, కొన్ని అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియోలు పంపించడంతో, పొద్దార్ ఆర్మీకి సంబంధించిన 96 ఫీల్డ్ రెజిమెంట్లు, 10 మీడియం రెజిమెంట్ల సమాచారాన్ని గుట్టుగా చేరవేశాడు. సైన్యంలో ఉన్న వ్యక్తి అలా ఓ మహిళను గుడ్డిగా నమ్మడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కఠినమైన శిక్షణ, బలమైన మనస్తత్వం కలిగి ఉండాల్సిన ఓ వ్యక్తి... దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని సునాయాసంగా ఇచ్చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ రేగుతోంది. ఇంత కీలకమైన సమాచారాన్ని అడుగుతున్నా ఆమెపై పొద్దార్ కు అనుమానం రాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఆమె అడగడమే తరువాయి పొద్దార్ ఆర్మీ గురించి, ఆర్మీ కదలికల గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను చెప్పేశాడు. దీంతో సైనికాధికారులు అనుష్క అగర్వాల్ కు పొద్దార్ అందించిన సమాచారం తాలూకు ఆనవాళ్లు లేకుండా పూర్తిగా మార్చేశారు. శత్రువు ఎలాంటి ప్రణాళికలు రచించినా అందుకు నష్టపోకుండా అవసరమైన చర్యలను సైనికాధికారులు చేపట్టారు. కాగా, అనుష్క అగర్వాల్ అనే వ్యక్తి ఫేక్ ఐడీని నిర్వహిస్తూ పొద్దార్ నుంచి సమాచారం సేకరించారు. అనుష్క అగర్వాల్ అనే వ్యక్తి మహిళా? పురుషుడా? అనేది నిర్ధారించాల్సి ఉంది. రాజస్థాన్ లోని ఓ అడ్రస్ నుంచి పొద్దార్ తో ఛాటింగ్ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఆ ఫేక్ ఐడీని ఎవరు ఆపరేట్ చేశారు? దాని నుంచి ఎవరెవరికి సమాచారం వెళ్లింది? దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పొద్దార్ పై దేశద్రోహం, నిషేధిత మల్టీలెవెల్ మార్కెటింగ్ తో పాటు మరిన్ని సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News