: సత్యంపై సెబీ ఫిర్యాదు
మొన్నటి వరకు ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా పేరొంది, స్కాములతో పతనమైన సత్యం కంప్యూటర్స్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెబీ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. సత్యం కంప్యూటర్స్ కు ఆడిటింగ్ చేసిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది పెట్టుబడిదారులను మోసం చేశారని సెబీ ఆరోపించింది. ప్రభుత్వానికి, పర్యవేక్షణ సంస్థలకు సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం తప్పుడు నివేదికలు సమర్పించి దేశ ప్రతిష్ఠను, మదుపరుల నమ్మకాన్ని దెబ్బతీసిందని సెబీ ఆరోపించింది. సెబీ నిబంధనలు ఉల్లంఘించి సత్యం యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని, అందుకు కారకులైన 15 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెబీ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. నిందితులుగా రామలింగరాజు, అయన సోదరుడు రామరాజు, ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, అడిటింగ్ నిర్వహించిన పీడబ్ల్యూడీసీ ఆడిటింగ్ సంస్థతో పాటు ఆడిటర్లు తాళ్లూరి శ్రీనివాస్, గోపాల కృష్ణన్ తో పాటు 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. క్రిమినల్ కోడ్ 200 తో పాటు, సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27 కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు రెండు రోజుల్లో ప్రత్యేక కోర్టు ముందుకు విచారణకు రానుందని సమాచారం.