: ప్రధాని నుంచి ఉత్తరం వచ్చేసరికి పొంగిపోయింది!
ముంబయికి చెందిన ఐశ్వర్య కాంకే అనే పదహారేళ్ళ అమ్మాయి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయడాన్ని హాబీగా ఎంచుకుంది. ఆయన ప్రధాని పగ్గాలు చేపట్టకముందు కూడా లేఖలు రాసేది. అయితే, ఆమెకు ఇంతకుమునుపెన్నడూ ప్రత్యుత్తరాలు రాలేదు గానీ, ఇటీవలే మోడీ నుంచి రిప్లయ్ వచ్చేసరికి పొంగిపోతోంది. ఆమె దస్తూరి ఎంతో పొందికగా ఉందని, లేఖల్లో ఎత్తి చూపుతున్న అంశాలు కూడా ఆలోచించదగినవిగా ఉన్నాయని మోడీ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నుంచి వచ్చిన ఉత్తరంపై ఐశ్వర్య స్పందిస్తూ, రిప్లయ్ ఆశించి ఎప్పుడూ లేఖలు రాయలేదని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళడానికే ప్రాధాన్యమిచ్చేదాన్నని తెలిపింది. దేశ ప్రధాని నుంచి ఉత్తరం రావడాన్ని నమ్మలేకపోతున్నాని విస్మయం వెలిబుచ్చింది. ఐశ్వర్య ప్రస్తుతం ముంబయిలోని కేఈఎస్ ష్రాఫ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తోంది.