: టీపీసీీసీ చీఫ్ రేసులో డీకే అరుణ


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు మాజీ మంత్రి, మహబూబ్ నగర్ జిల్లాలో కీలక నేత డీకే అరుణ తన యత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసిన అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనసులోని మాటనూ ఆయన ముందుంచారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న పార్టీ బరువు బాధ్యతలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పార్టీ పగ్గాలప్పగిస్తే, తన ప్రతాపమేంటో చూపిస్తానని కూడా దిగ్విజయ్ ముందు సత్తా చూపే యత్నం కూడా చేశారట. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తనకంటే మెరుగైన నేత దొరకరంటూ ముందుగానే రూపొందించుకున్న వాదనను వల్లెవేశారట. మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టిన అరుణ, నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్యను వెంటపెట్టుకుని మరీ పార్టీ అధిష్ఠానం ముఖ్యులను కలుస్తున్నారు. ఇప్పటికే శాసనసభలో పార్టీ నేతగా అవకాశమివ్వాలని కోరిన అరుణకు, జానారెడ్డి రూపంలో అవకాశం చేజారిపోయింది. తాజాగా పీసీసీ పదవి ఇచ్చినా చాలునంటూ ప్రతిపాదిస్తున్నారట. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతగా తన సత్తా ఏమిటో మీరే చూస్తారంటూ కూడా ఆమె కాస్త గట్టిగానే యత్నిస్తున్నారు. అంతేకాక గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి పదవినీ మహిళలకు కేటాయిస్తామన్న అంశాన్ని కూడా అధిష్ఠానానికి గుర్తు చేసిన అరుణ, తాను పీసీసీ రేసులో అందరికంటే ముందున్నట్లు నిరూపించుకునేందుకే ఢిల్లీలో మకాం వేసినట్లు వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News