: ఆంధ్రులపై విమర్శలు లేకుండా కేసీఆర్ పాలించగలరా?: దేవినేని
అనవసర వివాదాలు, ఆంధ్రా ప్రజలు, నేతలపై విమర్శలు లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలించలేరని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రులు పచ్చగా ఉన్నారని కేసీఆర్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. అందుకే ఆంధ్రా నేతలను విమర్శించకుండా ఉండలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై, నేతలపై బురద జల్లడమే మేలనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పనులు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పిట్టలదొర హామీలు నెరవేర్చకుండా అనవసర వివాదాలు రేపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల పేర్లు మార్చమని కేసీఆర్ ను ఎవరు అడిగారని ఆయన నిలదీశారు. విగ్రహాలు తరలించడం, పేర్లు మార్చడం తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని, కొత్త నిర్మాణాలు, ఉద్యోగావకాశాలు కోరుతున్నారని ఆయన సూచించారు. కొత్తవి కట్టకుండా, ఉన్నవాటి పేర్లు మార్చేస్తే అభివృద్ధి చేసినట్టా? అని చురకలు అంటించారు.