: ఇస్రో వర్గాల్లో టెన్షన్... 'మంగళ్యాన్' కు పొంచి ఉన్న ముప్పు!
భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో 'మంగళ్యాన్' స్థానం ప్రత్యేకం. అంగారక గ్రహ వాతావరణంపై అధ్యయనం నిమిత్తం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం 'మంగళ్యాన్' అరుణగ్రహం దిశగా దూసుకెళుతోంది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ కు అతిపెద్ద సవాలు ఎదురునిలిచింది. వచ్చే నెలలో, అంటే, సెప్టెంబర్ 24న మంగళ్యాన్ ఆర్బిటర్ అంగారక వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అయితే, సైడింగ్ స్ప్రింగ్' అనే భారీ తోక చుక్క అక్టోబర్ 19న అరుణ గ్రహానికి అత్యంత సమీపానికి దూసుకురానుంది. ఆ తోకచుక్కే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ తోకచుక్కతో మంగళ్యాన్ ఢీకొనే ప్రమాదముండడమే వారి ఆందోళనకు కారణం. దీనిపై ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ విభాగం డైరక్టర్ ఏఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, మంగళ్యాన్ ఆర్బిటర్ అంగారక కక్ష్యలో కుదురుకున్న తర్వాత, 'సైడింగ్ స్ప్రింగ్' ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతామని తెలిపారు. ఓ విధంగా చూస్తే, అత్యంత అరుదైన తోకచుక్క గురించి పరిశోధించే అవకాశం మనముందు నిలిచినట్టు భావించాలని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ భారీ తోక చుక్కను 2013లో రాబర్ట్ హెచ్ మెక్ నాట్ అనే పరిశోధకుడు ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ నుంచి తొలిసారి గుర్తించారు. దీంతో, ఈ తోకచుక్కను 'సైడింగ్ స్ప్రింగ్' పేరిట పిలుస్తున్నారు.