: సైనికులకు బిర్యానీతో కడుపు నింపిన భారత సంతతి మహిళ
ఇజ్రాయెల్ దేశంలో 'కర్రీ క్వీన్' గా పేరొందిన ఓ భారత సంతతి మహిళ హమాస్ తో పోరాడుతున్న సైనికులకు బిర్యానీతో కడుపు నింపారు. ఆమె పేరు రీనా పుష్కర్ణ. ఇజ్రాయెల్ గడ్డపై 'తందూరీ' పేరిట చైన్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న రీనా గతవారం ఇజ్రాయెల్, పాలస్తీనా సరిహద్దు వద్ద మకాం వేశారు. తన సిబ్బందితో కలిసి ఆ యుద్ధరంగంలో ఓ తాత్కాలిక కిచెన్ ఏర్పాటు చేసిన ఈ భారత సంతతి మహిళ... ఆ సందర్భంగా 400 కేజీల బిర్యానీ వండివార్చారు. మొత్తమ్మీద 2000 మంది సైనికులకు కమ్మని బిర్యానీ తినిపించారట. ఆ సైనికుల్లో భారత సంతతి యూదులు కూడా ఉన్నారు. కాగా, పుష్కర్ణ కుటుంబం 30 ఏళ్ళ కిందట భారత్ నుంచి టెల్ అవీవ్ కు చేరుకుంది. ఆమె తండ్రి ఓ రిటైర్డ్ కల్నల్. అన్నట్టు... రీనా బీజేపీకి గట్టి మద్దతుదారు. బీజేపీ విదేశీ మిత్రుల విభాగం ఇజ్రాయెల్ చాప్టర్ కు ఈమె కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే... టెల్ అవీవ్ లో ఉన్న 'తందూరీ' రెస్టారెంటు 1993లో ఇజ్రాయెల్, పాలస్తీనా శాంతి చర్చలకు వేదికగా నిలిచింది. ఈ చర్చలకు నార్వే మధ్యవర్తిత్వం వహించిన సంగతి తెలిసిందే.