: బతికున్న టెస్టు క్రికెటర్లలో ఈయనే పెద్దవాడు!
నార్మన్ గోర్డాన్... దక్షిణాఫ్రికా క్రికెటర్. అయితే ఏంటి? అంటారా..! ఇప్పటివరకు బతికున్న టెస్టు క్రికెటర్లలో ఈయనే పెద్ద వయస్కుడు మరి. గోర్డాన్ మహాశయుడికిప్పుడు 103 ఏళ్ళు. క్రికెట్ పరిభాషలో చెప్పుకోవాలంటే 103 నాటౌట్! గోర్డాన్ 1938/39 సీజన్ లో ఐదు టెస్టు మ్యాచ్ లాడాడు. అన్నిటికంటే ముఖ్యంగా... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చారిత్రక 'టైమ్ లెస్' టెస్టులో గోర్డాన్ రెండు ఇన్నింగ్స్ లలోనూ నాటౌట్ గా నిలిచాడు. అయితే, ఆ పోరులో ఆ 'పెద్ద'మనిషి చివరి బ్యాట్స్ మన్ గా బరిలో దిగాడు. 1939 మార్చి 3 నుంచి 14 వరకు డర్బన్ వేదికగా ఈ మ్యాచ్ జరగడం విశేషం. మొత్తం 10 రోజుల పాటు జరిగిన ఈ టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఆ టెస్టే గోర్డాన్ కెరీర్లో ఆఖరిది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన గోర్డాన్ 5 టెస్టుల్లో 20 వికెట్లు తీసి సత్తా చాటాడు. అన్నట్టు... ఇతగాడి నిక్ నేమ్ 'మోబిల్'. బిరుసైన తలవెంట్రుకలను అణిచివేసేందుకు జుట్టుకు వ్యాజలైన్ పూసేవాడట. అందుకే 'మోబిల్' అని పిలిచేవారు సహచరులు. 'మోబిల్' ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లూబ్రికెంట్ తయారీదారన్న సంగతి తెలిసిందే.