: ఎన్జీరంగా యూనివర్శిటీ పేరు మార్పుపై గవర్నర్ కు ఏపీ మంత్రుల ఫిర్యాదు
హైదరాబాదులోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఏపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని మంత్రి కేఈ మీడియాతో అన్నారు. విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం అవసరమని, దీన్ని ఆపాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. అటు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని గవర్నర్ కు చెప్పామన్నారు. అటు పరకాల మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిశోధనలు తెలుగు ప్రజలందరికీ దక్కాలన్నారు. విభజన చట్టాన్ని టీఎస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్న ఆయన, ఇలాంటి చర్యలు అపేలా తెలంగాణ ప్రభుత్వానికి నచ్చజెప్పాలని గవర్నర్ కు వివరించామన్నారు.