: కొత్త స్పిన్నరొచ్చాడు!
స్పిన్నర్లకు పురిటిగడ్డగా భారత్ ను పరిగణించడం తెలిసిందే. ఎర్రాపల్లి ప్రసన్న, వెంకట్రాఘవన్, బీఎస్ చంద్రశేఖర్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, వెంకటపతిరాజు వంటి మహోన్నత స్పిన్నర్లు భారత్ కు విశిష్ఠ సేవలందించారు. ఇటీవలి కాలంలో రవిచంద్రన్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నా, అది సొంతగడ్డపైనే. దీంతో, నికార్సైన స్పిన్నర్ కోసం టీమిండియా వ్యూహకర్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కోసం ఎంపికైన వర్ధమాన లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. డెత్ ఓవర్లలో బ్యాట్స్ మెన్ కు ముకుతాడు వేస్తాడని కరణ్ శర్మకు పేరుంది. ఐపీఎల్-7లో ఆ విషయం రుజువైంది కూడా. లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 14 మ్యాచ్ లాడి 15 వికెట్లు తీశాడు (సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టులో ఉన్నప్పటికీ ). పరుగులివ్వడంలో పొదుపరితనం, కీలక సమయాల్లో వికెట్లు తీయడం ఇతడి స్పెషాలిటీ. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా-ఏ జట్టుతో టెస్టు సిరీస్ లోనూ మనవాడు మెరుగైన ప్రతిభ కనబరిచి టీమిండియా తలుపు తట్టాడు. అంతేకాదండోయ్, కరణ్ శర్మలో ధాటిగా ఆడే బ్యాట్స్ మన్ కూడా ఉన్నాడు. రంజీ అరంగేట్రం మ్యాచ్ లో రైల్వే జట్టుకు ఆడుతూ జమ్మూకాశ్మీర్ పై తొలి ఇన్నింగ్స్ లో 120 పరుగులు చేయడం విశేషం. మరి, కరణ్ శర్మ తన ప్రతిభను అంతర్జాతీయ మ్యాచ్ లలోనూ ప్రదర్శిస్తే భారత్ కు మరో ఆణిముత్యం లభించినట్టే.