: మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడి క్షమాభిక్షకు రాష్ట్రపతి నిరాకరణ


ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మృగానికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ససేమిరా అన్నారు. పసికందును చిదిమేసిన పాపానికి క్షమాభిక్ష ప్రసాదించేది లేదని ఆయన గత నెల 31న నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అభంశుభం తెలియని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారికి ఇకపై ఉరే సరంటూ తన కఠిన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారి గుండెల్లో గుబులు పుట్టించారు. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాక... హత్య చేసిన దుర్మార్గుడు రాజేంద్ర ప్రహ్లాద్ రావు వాస్నిక్ కు మరణ శిక్ష ఖరారు చేసిన కోర్టు తీర్పుపై నిందితుడు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి అనుమతి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పంపింది. అయితే, ఈ తరహా నేరస్తులను స్వల్ప శిక్షలతో విడుదల చేసేది లేదని పిటిషన్ ను రాష్ట్రపతి తోసిపుచ్చారు. తాజా తిరస్కరణతో రెండేళ్ల తన పదవీ కాలంలో... 22 కేసులకు సంబంధించిన 29 మంది కరడుగట్టిన నేరస్తుల క్షమాభిక్ష పిటిషన్లను ప్రణబ్ తోసిపుచ్చారు. అంతకుముందు క్షమాభిక్ష పిటిషన్లపై కాస్త మెతక ధోరణిలో వ్యవహరించిన రాష్ట్రపతులు, ముంబై దాడుల దరిమిలా కఠిన వైఖరి అవలంభించేందుకే మొగ్గుచూపుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. గతంలో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన కేఆర్ నారాయణన్ అసలు క్షమాభిక్ష పిటిషన్లనే పరిశీలించలేదు. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలామ్ ఒకే ఒక్క క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. ప్రణబ్ కు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన ప్రతిభా పాటిల్ మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. అయితే క్షమాభిక్ష పిటిషన్లను వేగవంతంగా పరిష్కరిస్తున్న ప్రణబ్... గత నెలలోనే ఆరుగురి మరణశిక్షకు సంబంధించిన ఐదు పిటిషన్లను తిరస్కరించారు.

  • Loading...

More Telugu News