: భూపీందర్ సర్కారు తీరు మారదు


తనకు అనుకూలంగా వ్యవహరించని అధికారులపై కక్షసాధింపు చర్యలకు ఏమాత్రం వెనుకాడని హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా సర్కారు, మరోమారు తన నిజస్వరూపాన్ని చాటుకుంది. సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వ సిపారసులను అమలు చేయని సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కన్సీపై బదిలీ వేటు పడింది. పరిపాలన సంస్కరణల శాఖ కార్యదర్శిగా ఇప్పటిదాకా బాధ్యతలు నిర్వర్తించిన కన్సీని తాజాగా హుడా సర్కారు అంతగా ప్రాధాన్యం లేని కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ కు బదిలీ చేసింది. మాట వినని అధికారులను బదిలీల పేరుతో వేధించడం హుడా సర్కారుకు కొత్తేమీ కాదని అధికార వర్గాలు నొసలు చిట్లించడం మినహా ఏం చేస్తారు చెప్పండి. సమాచార కమిషనర్లుగా నియమించాలని ప్రభుత్వం సూచించిన జాబితాలో మెజార్టీ వ్యక్తులకు అసలు అందుకు తగ్గ అర్హతలు లేవు. దీంతో ప్రభుత్వ సిపారసులను కన్సీ అమలు చేయలేదు. ఈ క్రమంలో, ఆయనపై కక్షగట్టిన ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేత బెదిరింపులకు పాల్పడింది. ఈ బెదిరింపులకు వెరవని కన్సీ, మీడియా సమావేశం పెట్టి మరీ, హుడా సర్కారుతో పాటు చీఫ్ సెక్రటరీ బాగోతాన్ని కడిగిపారేశారు. అయితే అప్పుడే రాష్ట్ర గవర్నర్ గా కప్తాన్ సింగ్ సోలంకి బాధ్యతలు చేపట్టడం, కన్సీకి కొంతైనా భరోసా లభించింది. ఈ వివాదంపై దృష్టి సారించిన సోలంకి, అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో హుడా సర్కారు చేతిలో నానా ఇబ్బందులు పడ్డ అశోక్ ఖేమ్కాకు బీజేపీ సర్కారు కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గవర్నర్ సోలంకి రంగప్రవేశంతో కన్సీకి కూడా మేలు జరుగుతుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News