: ‘రోటీ’ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: ఉద్ధవ్ ఠాక్రే
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వ్యక్తి నోట్లో బలవంతంగా రోటీని కుక్కి దేశవ్యాప్త చర్చకు తెరతీసిన తమ పార్టీ ఎంపీని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వెనకేసుకొచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయం చేస్తోందని పార్టీ పత్రిక సామ్నాలో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘సర్వర్ ముఖం మీద మతం పేరు రాసి ఉంటుందా?’ అంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. ముందుగా ఢిల్లీలోని మహరాష్ట్ర సదన్ లో మరాఠి సంస్కృతికి జరుగుతున్న అన్యాయంపై మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ దృష్టి సారించాలని ఠాక్రే సూచించారు. అనుకోకుండా జరిగిన ఘటనపై విచారణ అంటూ గోల చేస్తే, చవాన్ కు కూడా బలవంతంగానే రోటీ తినిపించాల్సి ఉంటుందని కూడా ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర సదన్ లో మరాఠి తరహా భోజనం లేదేమిటంటూ గతవారం జరిగిన ఈ ఘటనలో తొలుత శివసేన ఎంపీలు ఐఆర్ సీటీసీ కేటరింగ్ కు చెందిన సర్వర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆహారం ఎలా ఉందో రుచిచూడాలంటూ అతడి నోట్లో శివసేన ఎంపీ రోటీని కుక్కారని సమాచారం. బుధవారం నాటి సంచికలో ఈ ఘటనను ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. పార్లమెంట్ ను కుదిపేసింది. దీనిపై ఠాక్రే మధ్యేమార్గంగా స్పందిస్తారని అనుకుంటే, ఏకంగా కాంగ్రెస్ పై ఆయన ఎదురు దాడి చేయడం గమనార్హం.