: దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ భగత్ సింగ్
దేశసేవ కోసం ప్రాణాలు అర్పించిన అలనాటి భగత్ సింగ్ గురించి అందరికీ తెలుసు. అలాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెట్టుకున్న హైదరాబాదుకు చెందిన భగత్ సింగ్ కూడా చివరి వరకు దేశం కోసమే పనిచేశాడు. 2014, జూలై 25న ఉత్తరప్రదేశ్ లో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్ నడుపుతోన్న భగత్ సింగ్ ఓ సాహసం చేశాడు. జనావాసాల్లో హెలికాప్టర్ కూలిపోకుండా ప్రయత్నించాడు. చివరకు జనావాసాలకు దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కాలి బూడిదయ్యారు. పైలట్ భగత్ సింగ్ స్వస్థలం హైదరాబాదులోని బీహెచ్ఇఎల్ కాలనీ. కార్గిల్ యుద్ధం, ఉత్తరాఖండ్ వరదలతో సహా పలుమార్లు ఆయన సేవలందించారు. పిన్న వయస్సులోనే వింగ్ కమాండెంట్ గా ఎదిగిన భగత్ సింగ్... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సమయంలో, హెలికాఫ్టర్ జాడను ముందుగా గుర్తించాడు. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే అప్పట్లో వైఎస్ ప్రయాణించిన విమాన శకలాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భగత్ సింగ్ తండ్రి బీహెచ్ఇఎల్ లో ఉద్యోగి కావడంతో ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. ఆయన మరణంతో బాధపడుతున్నా, దేశం కోసం మరణించినందుకు గర్వపడుతున్నామని తల్లిదండ్రులు చెప్పారు.