: అందుకే ఆయన దేవుడయ్యాడు!


భారత్ లో క్రికెట్ ఓ మతమైతే, సచిన్ టెండూల్కర్ దేవుడు. దేవుడు మహిమలు చూపడం అత్యంత సహజం. ఆ కోవలోకే సచిన్ 2003 వరల్డ్ కప్ ప్రదర్శన కూడా వస్తుంది. దీనిపై సచిన్ సహచరుడు రాహుల్ ద్రావిడ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆ టోర్నీ సందర్భంగా సచిన్ నెట్స్ లో ఒక్క బంతినీ ఎదుర్కోలేదట. అంతెందుకు, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు కూడా సచిన్ ప్రశాంతంగా ఉన్నాడని ద్రావిడ్ తెలిపాడు. కేవలం దగ్గర్నుంచి త్రో డౌన్స్ వేయించుకుని ప్రాక్టీస్ చేశాడని వివరించాడు. ఇది చూసి అందరం ఆశ్చర్యపోయామని, అదేమని అడిగితే, నెట్స్ లోకి వెళ్ళి టచ్ కోల్పోవడం ఎందుకన్నాడని వాల్ వెల్లడించాడు. వందలకొద్దీ త్రో డౌన్స్ తోనే సరిపెట్టుకున్నాడని... ఆ తరహా ప్రాక్టీసు ఫలితం మ్యాచ్ లలో కనిపించిందని తెలిపాడు. ఆ టోర్నీలో సచిన్ 673 పరుగులు సాధించగా, అదో రికార్డయింది. మరే ఇతర బ్యాట్స్ మన్ కూడా సింగిల్ వరల్డ్ కప్ లో అన్నేసి పరుగులు నమోదు చేయలేకపోయారు. అన్నింటికీ మించి వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి పేస్ దిగ్గజాలను ఎదుర్కొని 98 పరుగులు చేయడం టోర్నీకే హైలైట్ గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలతో సచిన్ భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాడని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. గత 24 ఏళ్ళుగా ప్రతి ఒక్కరూ తాము సచిన్ శకంలో ఉన్నామని చెప్పుకోవడానికి గర్విస్తున్నారని వివరించాడు.

  • Loading...

More Telugu News