: వారెవా ... ఎల్లవ్వ విదేశీ మీడియాకెక్కింది!
ఎల్లవ్వ... ఇటీవలే తొమ్మిది నెలల గర్భంతో కృష్ణానదిని ఈది అందరినీ విస్మయంలో ముంచెత్తిన మత్స్యకార వర్గానికి చెందిన వీరనారి. ఎల్లవ్వ వీరోచిత ప్రదర్శన విదేశీ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. సుప్రసిద్ధ వార్తా సంస్థ బీబీసీ దీనిపై ప్రత్యేకంగా కథనం వెలువరించడం విశేషం. వివరాల్లోకెళితే... కర్ణాటకలోకి యాద్గిర్ జిల్లా నీలకంఠరాయనిగద్దె ఎల్లవ్వ స్వస్థలం. అదో లంక ప్రాంతం కావడంతో అక్కడ సౌకర్యాలు తక్కువే. ఆమెకు ప్రసవ సమయం దగ్గరపడడంతో తన కుటుంబ సభ్యుల సాయంతో అత్యంత ధైర్యసాహసాలు కనబర్చి ఈదుకుంటూ కృష్ణానది ఆవలి ఒడ్డుకు చేరింది. ఆ తర్వాత మరో కిలోమీటరు నడిచి మరీ ఆసుపత్రికి చేరుకుంది. ఆమెను పరీక్షించిన కెక్కెర గ్రామ డాక్టర్ ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. మరో 20-25 రోజుల్లో కాన్పు అవ్వొచ్చని, లోపల బిడ్డ బాగానే ఉందని పేర్కొన్నారు. ఎల్లవ్వ బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ... తొలుత భయపడినా, కడుపులో ఉన్న బిడ్డ కోసం తెగించానని తెలిపింది. నడుము చుట్టూ సొరబూరలు కట్టుకోవడంతో తేలిగ్గా ఈదగలిగానని వివరించింది. తన తండ్రి, సోదరులు ఈత సమయంలో ఎంతో సహకరించారని చెప్పింది.