: మహిళా పోలీసులకు బైకులు, షార్ట్ వెపన్స్!
ఢిల్లీలో మహిళలపై నేరాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. వీటిని అరికట్టేందుకు అక్కడి పోలీస్ శాఖ నడుంబిగించింది. ఈ క్రమంలో మహిళా పోలీసులకు ప్రత్యేకంగా ద్విచక్రవాహనాలను అందించనున్నారు. అంతేగాకుండా, వారికి వైర్ లెస్ సెట్లు, అత్యాధునిక షార్ట్ వెపన్స్ నూ సమకూర్చాలని నిర్ణయించారు. కేంద్ర హోం శాఖ ఇటీవలే ఢిల్లీ పోలీస్ విభాగానికి ఈ విషయమై పలు సూచనలు చేసింది. మహిళా పోలీసులతో పెట్రోలింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై ఢిల్లీ పోలీస్ వర్గాలు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో సైతం మహిళా పోలీసులు గస్తీ తిరుగుతారని, ఒక్కో స్క్వాడ్ లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు ఉంటారని తెలిపాయి. స్త్రీలకు రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని పేర్కొన్నాయి.