: ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ రూ.లక్ష కోట్లు... తొలిసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
తొలి సంవత్సరంలోనే చంద్రబాబు సర్కార్ లక్ష కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులకు స్పష్టం చేశారు. బడ్జెట్ కోసం ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి... వారి వద్దనుండి ప్రతిపాదనలు తీసుకున్నానని యనమల తెలిపారు. ఆగస్ట్ 20న ఆంధ్రప్రదేశ్ తొలి వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడుతో చర్చించి బడ్జెట్ కు తుదిరూపు ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ ను పదేళ్లు గడువు కోరతామని యనమల అన్నారు. రైతు రుణాలకు గ్యారంటీగా మూడు రకాల సెక్యూరిటీలను బ్యాంకులకు సమర్పిస్తామని ఆయన తెలిపారు.