: జర్మనీలో ఉన్నత విద్యకు భారతీయుల ఆసక్తి!
నిన్నటిదాకా విదేశాల్లో ఉన్నత విద్య అంటే.., అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడాలే కనిపించేవి భారతీయ విద్యార్థులకు. తాజాగా ఈ జాబితాలో జర్మనీ కూడా చేరిపోయింది. 2008 నుంచి ఉన్నత విద్య కోసం జర్మనీ వెళుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. 2008లో ఉన్నత విద్య కోసం 3,516 మంది భారత విద్యార్థులు జర్మనీ వెళ్లగా, 2013 వచ్చేసరికి ఈ సంఖ్య 7,532 కు చేరింది. అంటే ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళుతున్న విద్యార్థుల సంఖ్య, ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధి చెందిందన్నమాట. గతంలో జర్మనీలో విద్యనభ్యసించాలంటే తప్పనిసరిగా జర్మన్ భాష నేర్చుకుని తీరాల్సి వచ్చేది. తాజాగా ఈ నిబంధనలను కొద్దిమేర సడలించిన ఆ దేశం, ఆంగ్లంలోనూ ఉన్నత విద్యా కోర్సులను అందించడం ప్రారంభించింది. అంతేగాక విద్యాభ్యాసం తర్వాత అక్కడి కంపెనీల్లో ఇంటర్న్ షిప్ లతో పాటు ఉద్యోగాలు చేసేందుకూ విదేశీయులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, భారతీయ వర్సిటీలతో పలు ఒప్పందాలు చేసుకునేందుకు ఆ దేశ వర్సిటీలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్ నుంచి జర్మనీకి ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్థుల్లో మెజారిటీ వాటా ఇంజినీరింగ్ విద్యార్థులదే. జర్మనీ వెళుతున్న భారత విద్యార్థుల్లో సగం మేర ఇంజినీరింగ్ విద్యార్థులే ఉంటున్నారు. ఆ తర్వాతి స్థానం గణితం, జీవ శాస్త్రాలకు చెందిన విద్యార్థులది కాగా, ఐటీ రంగ విద్యార్థులు కూడా జర్మనీ వెళ్లేందుకు బాగానే ఇష్టపడుతున్నారు. భారత్ నుంచి జర్మనీ వెళుతున్న వారిలో ఐటీ విద్యార్థుల వాటా 13.08 శాతంగా నమోదైంది. ఇదిలా ఉంటే, భారత ప్రసిద్ధ విద్యాలయాలు ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు పలు జర్మనీ వర్సిటీలు పోటీపడుతున్నాయి. ఇక్కడికొచ్చే భారత విద్యార్థులకు స్పాన్సర్ షిప్ లు, స్కాలర్ షిప్ లు లభించే దిశగానూ జర్మనీ చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఇప్పటిదాకా భారతీయ విద్యా సంస్థలతో జర్మనీ 46 ఒప్పందాలు చేసుకుంది. జర్మనీకి వెళ్లే భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు స్కాలర్ షిప్, ఇంటర్న్ షిప్ తో పాటు ఉపాధి అవకాశాలను కల్పించే క్రమంలోనే ఈ ఒప్పందాలు జరిగాయని చెన్నైలోని జర్మనీ అకడమిక్ ఎక్స్ చేంజ్ సర్వీస్ సెంటర్ చెబుతోంది. వీసా నిబంధనలను సరళతరం చేసి, విదేశీ విద్యార్థులకు తలుపులు బార్లా తెరిచిన జర్మనీలోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు భారత విద్యార్థులు కూడా పరుగులు పెడుతున్నారు.