: ఆమె ఇష్టాన్ని బట్టి పెళ్లి చేసుకుంది... మీకేంటి ఇబ్బంది?: సుప్రీం మొట్టికాయలు
తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జూన్ 16న ప్రేమ వివాహం చేసుకున్న 19 ఏళ్ల యువతికి సుప్రీంకోర్టు అండగా నిలిచింది. ఎవర్ని భాగస్వామిగా ఎంచుకోవాలో ఆమెకు తెలుసని పేర్కొన్న న్యాయస్థానం, వివాహ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ యువతికి ఉందని స్పష్టం చేసింది. భర్తతో కలిసి ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆమెకుందని సుప్రీంకోర్టు పోలీసులకు మొట్టికాయలు వేసింది. తక్షణం ఆమెకు విముక్తి కల్పించాలని పోలీసులను ఆదేశించింది. కాగా, యువతి మైనర్ అని తల్లిదండ్రులు పేర్కొనడంతో రాజస్థాన్ హైకోర్టు నారీ నికేతన్ లో ఉంచాలంటూ ఆదేశాలిచ్చింది. ఘజియాబాద్ కు చెందిన ఆమె భర్త, తన భార్య మైనర్ కాదని సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి నిరూపించాడు. దీంతో ఆమెను నిర్బంధించడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.