: పులి బోనులో చేయి పెడితే... ఫలితం ఇలాగే ఉంటుంది!
పులి ఎక్కడున్నా దాని స్వభావంలో మార్పుండదు. అడవిలోనైనా, జూలోనైనా... పులి పులే! 'బోనులో ఉందికదా, మనల్నేం చేస్తుందిలే' అని ఓ చిన్నారి దానికి ఆహారం పెట్టబోయాడు. అది కాస్తా ఆ బాలుడి చేతిని దొరకబుచ్చుకుని కరకర నమిలేసింది. సీన్ కట్ చేస్తే... డాక్టర్లు ఆ అబ్బాయికి ఆపరేషన్ చేసి నుజ్జునుజ్జయిన చేతిని తొలగించేశారు. బ్రెజిల్లో జరిగిందీ సంఘటన. పరానా ప్రాంతంలోని కాస్కావల్ జంతు ప్రదర్శనశాలను చూసేందుకు ఓ తండ్రి తన ఇద్దరు కుమారులతో అక్కడికి వచ్చాడు. పులికి ఆహారం పెట్టాలంటూ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ బాలుడు ఎన్ క్లోజర్ లోకి చేయిచాచాడు. దీంతో, ఆ పులి చటుక్కున చేతిని కొరికేసింది. వెంటనే జూ సిబ్బంది ఆ చిన్నారిని సమీపంలోని యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. పలు మార్లు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆ చేయిని తీసేశారు. దీంతో, ఆ చిన్నారి వికలాంగుడయ్యాడు. బాలుడు పులి ఉన్న ప్రదేశానికి వెళుతుండడాన్ని గమనించిన కొందరు అతని తండ్రిని హెచ్చరించారట కూడా. వారి దురదృష్టం కొద్దీ పులులుండే ఎన్ క్లోజర్ వద్ద ఉండాల్సిన గార్డు ఆ సమయంలో రౌండ్స్ కు వెళ్ళాడట. సంఘటనపై జూ బయాలజిస్ట్ మాట్లాడుతూ, ఆ పులి పేరు హు అని, దాని బరువు 200 కిలోలని తెలిపారు. గత రెండేళ్ళుగా జూలో ఉంటున్న హు చాలా మంచి జంతువని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, దాడి సమయంలో అక్కడే ఉన్న టీచర్ రికార్డో ఎస్పిండ్యులా... బాలుడు ఆహారం పెట్టడానికి సిద్ధపడడంతో ఏదో జరగబోతోందని భావించి దాడికి ముందు సన్నివేశాలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడట. ప్రస్తుతం ఆ పులిని ఒంటరిగా ఉంచారు. అంతేగాకుండా, కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.