: జూనియర్ జడ్జి 'ఐటం డ్యాన్సు' చేస్తే ఈ హైకోర్టు జడ్జి చూస్తాడట!
మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ సీనియర్ జడ్జి విలువలు విస్మరించి వార్తల్లోకెక్కాడు. అడిషనల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా న్యాయమూర్తిని ఐటం సాంగుకు డ్యాన్సు చేయాలని కోరాడీ ప్రబుద్ధుడు. అతని వేధింపులకు అడ్డుకట్ట పడకపోవడంతో ఆ మహిళా జడ్జి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆ సీనియర్ జడ్జి విషయమై రాష్ట్రపతి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారామె. దీనిపై, నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా స్పందిస్తూ, ఈ విషయమై తానింకా అధికారికంగా ఫిర్యాదును అందుకోలేదని తెలిపారు. మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను నివేదిక కోరతామని, అది వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సుప్రీం గతంలో లైంగిక వేధింపులపై ఏర్పాటు చేసిన 'విశాఖ కమిటీ'కి బాధితురాలే నాయకత్వం వహించారు. ఇప్పుడామెపైనే వేధింపులు చోటుచేసుకోవడం నిజంగా విచారకరం. కాగా, తన ఇంట్లో జరిగే ఓ వేడుకలో ఐటం సాంగుకు నర్తించాలని ఓ అధికారి ద్వారా వర్తమానం పంపారని అదనపు జడ్జి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె జన్మదినం అని చెప్పి ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నానని తెలిపారు. ఎంతకీ అతనికి తాను లొంగకపోవడంతో తన పలుకుబడితో, హైకోర్టు విధివిధానాలకు విరుద్ధంగా, జూలై 8న తనను ఓ మారుమూల ప్రాంతమైన సిద్ధికి బదిలీ చేయించారని ఆమె వాపోయింది. దాంతో విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు.