: పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వండి: మేనకాగాంధీ


పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఇప్పటికే గుజరాత్ లో పోలీస్ శాఖ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుా నిర్ణయం తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. ఇలా చేయడం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, నేరాలు, అత్యాచారాలు తగ్గుతాయని మేనకాగాంధీ పేర్కొన్నారు. మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్... ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో గుజరాత్ మోడల్ ను మిగతా రాష్ట్రాలు ఫాలో కావాలని మేనకాగాంధీ సూచించారు. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా దేశంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు చాలా వరకు తగ్గుతాయని... ఇలాంటి నేరాలపై దర్యాప్తు జరిగినప్పుడు మరింత పారదర్శకత ఉంటుందని మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే గుజరాత్ ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీస్ విభాగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తోంది.

  • Loading...

More Telugu News