: లగడపాటి కుశలంగా ఉన్నారా..?: కేటీఆర్
హైదరాబాద్ లో నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ఓ విచిత్రం జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవగా... లగడపాటి రాజగోపాల్ సతీమణి పద్మ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వీరు ఇరువురూ కొద్దిసేపు మాట్లాడుకోవడంతో పాటు... పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ఎలా ఉన్నారని కేటీఆర్... పద్మను అడగగా... బాగానే ఉన్నారని పద్మ బదులిచ్చారు. రాజకీయాలు వదిలివేసిన తర్వాత రాజగోపాల్ ఆనందంగా ఉన్నట్టున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించగా... రాజకీయాలు వదిలివేసిన తర్వాత రాజగోపాల్ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నారని పద్మ బదులిచ్చారు. ఈ సందర్భంగా పద్మ కూడా కేటీఆర్ ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను తిరగనివ్వబోమని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పద్మ కేటీఆర్ వద్ద ప్రస్తావించారు. దీనికి కేటీఆర్, ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను అడ్డుకునే సమస్యే లేదని.... కేవలం ఒక పర్మిట్ తో పది బస్సులను నడుపుతున్న వారిని మాత్రం అడ్డుకుంటామని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తానికి వీరివురి సంభాషణ ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో కూడా లగడపాటి రాజగోపాల్ రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నప్పుడు... ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేటీఆర్ ఫోన్ చేసి మరీ లగడపాటి రాజగోపాల్ ను కోరారు.