: 'సుందర్ బన్స్' సామర్థ్యం తగ్గిపోతోంది!


ఎత్తైన చెట్లు, దట్టంగా పరుచుకుని ఉండే ముళ్ళపొదలు, విపరీతంగా అల్లుకుపోయిన తీగజాతి మొక్కలు... అడవులంటే అత్యధికుల్లో ఉండే అభిప్రాయం ఇది! కానీ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ అడవులు ఉంటాయని, అవి చాలా పొట్టిగా ఉంటాయని తెలిసినవాళ్ళు చాలా తక్కువమందే. సముద్రాలు పోటుకు గురైనప్పుడు నీరు బయటికి తన్నుకొస్తుంది. ఆ నీరు పల్లపుప్రాంతాల్లోకి ప్రవహించి అక్కడ సరస్సుల వంటి జలాశయాలు రూపొందుతాయి. ఇవి కొన్ని ప్రదేశాల్లో లోతు తక్కువగా ఉంటాయి. అక్కడ మడ జాతికి చెందిన చెట్లే ఎక్కువగా మనుగడ సాగిస్తాయి. ఇవి తక్కువ ఎత్తు పెరిగినా ఒత్తుగా కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో సుందర్ బన్స్ పేరిట ఈ మడ అడవులు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. యునెస్కో వీటిని వారసత్వ సంపద కింద ప్రకటించింది కూడా. అయితే, కొంతకాలంగా సుందర్ బన్స్ అడవుల్లో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించే సామర్థ్యం సన్నగిల్లుతోందని ఓ అధ్యయనం చెబుతోంది. ఇక్కడి నీటిలో లవణీయత పెరిగిపోవడం, చెట్లను నరికివేయడం వంటి కారణాల రీత్యా ఈ మడ అడవులు తమ విశేష సామర్థ్యాన్ని కోల్పోతున్నాయట. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక పర్యావరణ పరిస్థితుల్లో గణనీయ మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సుఫియా జమాన్ అనే సీనియర్ మెరైన్ బయాలజిస్టు తెలిపారు. ప్రఖ్యాత సముద్ర పరిశోధకుడు అభిజిత్ మిత్రా నేతృత్వంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు కేంద్రం ప్రభుత్వం నిధులు అందించింది. తమ ప్రాజెక్టుపై మిత్రా మాట్లాడుతూ, సుందర్ బన్స్ మధ్య ప్రాంతమైన మాట్లాలోని మడ అడవులు హెక్టారుకు 22 టన్నులు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటున్నాయని... అదే, సుందర్ బన్స్ తూర్పు ప్రాంతంలో హెక్టారుకు 35 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను పరిగ్రహిస్తున్నాయని వివరించారు. వియత్నాంలోని మడ అడవులు హెక్టారుకు 80-90 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకోగలుగుతున్నాయని తెలిపారు. తాజాగా నీటి లభ్యత తగ్గిపోవడంతో మడ అడవులు ఎక్కువ ఎత్తు పెరగడంలేదని, కార్బన్ డయాక్సైడ్ ను సమర్థంగా పీల్చుకోలేకపోవడానికి కారణమిదేనని తెలిపారు. నీటి లవణీయత పెరిగిపోవడంతో మడ అడవుల పెరుగుదలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగితే విపరీత మార్పులకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News