: ఈ యాప్ లు విదేశీ భాషలు నేర్పుతాయి!


చిన్న పనికీ పెద్ద పనికీ అని తేడా లేకుండా ప్రతి విషయానికీ యాప్ లు తయారయ్యాయి. దీంతో, సమయం ఆదా అవడంతో పాటు వ్యయమూ తగ్గుతుండడంతో వీటికి ఆదరణ బాగా పెరిగింది. చేతిలో ఓ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.... ఈ అప్లికేషన్ లతో ప్రపంచమే మన అరచేతిలో వాలుతుంది. తాజాగా మెమ్రైజ్, డ్యూలింగో, హెల్లోటాక్ పేరిట విదేశీ భాషలు నేర్పే యాప్ లు రంగప్రవేశం చేశాయి. విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి సంప్రదాయాలు, సంస్కృతిని అర్థం చేసుకునేందుకు స్థానిక భాషను మించిన సాధనం మరొకటి ఉండదు. ఈ ప్రత్యేక యాప్ లు చెంత ఉంటే లాంగ్వేజి ప్రాబ్లం ఉండదు. మెమ్రైజ్ లో విదేశీ భాషలకు సంబంధించి పలు లెవల్స్ ఉంటాయి. ఆయా పదాలను ట్రాన్స్ లేషన్ సహా ఈ యాప్ సాయంతో చూడొచ్చు. పర్యాయపదాలే కాకుండా, ఎలా పలకాలన్న విషయం కూడా తెలుసుకోవచ్చట. కొన్ని చిత్రాలను ఉపయోగించి పరభాషా పదాలను చూపిస్తుందీ యాప్. దీంతో ఎంచక్కా గుర్తుపెట్టుకోవచ్చు. డ్యూలింగో విషయానికొస్తే ఓ ఆట నేర్చుకున్నంత సులువుగా భాష నేర్పిస్తుంది. ముఖ్యంగా జర్మన్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకునేందుకు ఇది అనువైనది. ఆయా దేశాల్లో ఉపయోగించే జాతీయాలు, నుడికారాలను డ్యూలింగో చక్కగా వివరిస్తుంది. ఇక, హెల్లోటాక్ అయితే వ్యాకరణం, వ్యాసరచన వంటి నైపుణ్యాలపై అవగాహనకు మంచి వేదిక. ఆయా భాషలు ఎలా మాట్లాడాలో దీనిద్వారా మరింత మెరుగ్గా తెలుసుకోవచ్చు. మెమ్రైజ్, డ్యూలింగో యాప్ లు వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ పై ఉచితంగా పొందవచ్చు. హెల్లోటాక్... ఐఓఎస్, ఆండ్రాయిడ్ పైనే ఉచితం.

  • Loading...

More Telugu News