: ఆగస్ట్ 15 దగ్గరపడుతుండడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హై అలర్ట్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈ నెల 5 నుంచి 20 వరకు హై అలర్ట్ ను ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా దాడులు జరపవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో... పౌరవిమానయాన భద్రత సంస్థ దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఆదేశాల్లో భాగంగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈ నెల 5 నుంచి 20 వరకు హై అలర్ట్ అమల్లో ఉంటుంది. ఆగస్ట్ 5 నుంచి 20 వరకు ఎలాంటి పాసులు, ఎంట్రీ టికెట్లను జారీ చేయబోమని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. హైఅలర్ట్ నేపధ్యంలో ఈ పదిహేను రోజులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీఐపీ, వీవీఐపీ పాసులు సైతం రద్దవుతాయి.