: రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణకు నడుం బిగించిన ఎన్నారై టీడీపీ
ఎన్నికల సమయంలో 'బ్రింగ్ బ్యాక్ బాబు' అనే నినాదంతో టీడీపీ విజయం కోసం అంతులేని కృషి చేసిన 'ఎన్నారై టీడీపీ'... ఇప్పుడు మరో కార్యక్రమంలో తలమునకలై ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం తమ వంతుగా నిధులను సమకూర్చే పనిని భుజానికెత్తుకుంది. ఇందులో భాగంగా 'ఎన్నారై టీడీపీ సీటీ - క్యాపిటల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కనెక్టికట్, న్యూజెర్సీ, న్యూయార్క్, మాంఛెస్టర్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలండ్ లలో నివసిస్తున్న 450కి పైగా కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ, విభజన అనంతర రాష్ట్ర స్థిితిగతులను వివరించారు. అంతేకాకుండా, కొత్త రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలి? అనే విషయంపై మాట్లాడారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా రానుందని... దీంతో, మన రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదిగా మారబోతోందని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ఎన్నారైలు చేపట్టిన కార్యక్రమం ఎంతో గొప్పదని కొనియాడారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో... దాదాపు రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 30 వేల డాలర్ల నిధులను అక్కడికక్కడే సమీకరించారు. వీటిని స్పీకర్ కోడెలకు అందజేశారు. రాజధాని నిర్మాణం కోసం తమ వంతుగా వీలైనన్ని నిధులను సమీకరిస్తామని... రాజధాని నిర్మాణంలో భాగస్వాములమవుతామని ఎన్నారైలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి తానా ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని, నాట్స్ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ హాజరయ్యారు. ఎన్నారై టీడీపీ (కనెక్టికట్) నేతలు తరణి పరుచూరి, శ్రీనివాస్ అట్లూరి, సత్య, శ్రీనివాస్ యెండూరి, వెంకట్ కోనేరు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.