: స్నేహమంటే అది... సమాజ హితమే వారి లక్ష్యం!


చాలా మంది దృష్టిలో స్నేహమంటే కలిసి తిరగడం, కబుర్లాడుకోవడం, విహారయాత్రలకు వెళ్లడం, సాయంత్రాలు సరదాగా కూర్చోవడం, వీలైనన్ని ఎక్కువ ఫొటోలు సామాజిక అనుసంధాన సైట్లలో అప్ లోడ్ చేయడం. ఇంకా కుదిరితే అప్పుడప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం... ఇంతకంటే ఆలోచించడానికి యువతకు పెద్దగా ఏమీ ఉండడం లేదు. కానీ, ఆ ఐదుగురు మిత్రులు మాత్రం విభిన్నంగా సమాజ హితం కోరారు. షరీఫ్, నవీన్ రెడ్డి, కోటేశ్వర్ రావు, ఫనీ, మురళీకృష్ణలు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారు. చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. బీటెక్ పూర్తి చేసి వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు. అందర్లా కాకుండా 2005లో 'ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ కామ్' అనే వెబ్సైట్ను ప్రారంభించారు. రక్తదానం చేస్తూ, రక్తదానం పట్ల అందర్లోనూ అవగాహన పెంచుతూ వందలాది మందికి ప్రాణం పోస్తున్నారు. హైదరాబాద్లో 200 మంది రక్తదాతలతో ప్రారంభమైన ఈ సంస్థ, లక్షా 50 మందిపైగా డోనార్స్ తో కళకళలాడుతోంది. ఈ సభ్యులంతా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉండడం విశేషం. వీరికి రోజూ 150 మంది కొత్త డోనార్లు జత కలుస్తున్నారు. వీరంతా ప్రతిరోజూ 800 మంది రోగులకు రక్తం అందజేస్తూ సహాయపడుతున్నారు. తాము పెట్టిన సంస్థ ఇంతలా ఎదిగినా వారైదుగురిలో ఏమార్పు సంభవించకపోవడం విశేషం. 'ఫ్రెండ్స్ టూ సపోర్ట్' సంస్థ ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గత ఐదేళ్లుగా స్థానం సంపాదిస్తూనే ఉంది. పట్టణాలకే పరిమితమైన తమ సంస్థ రానున్న రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ ద్వారా రక్తం అవసరం ఉన్న వారికి సహాయపడాలని ఆలోచిస్తోంది. స్నేహానికి కొత్త నిర్వచనమిచ్చిన వీరికి అభినందనలు తెలుపుతున్నారు వీరిచే సహాయం పొందిన ప్రతి ఒక్కరూ!

  • Loading...

More Telugu News