: రాజకీయాలను పక్కనబెట్టాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించా: వెంకయ్యనాయుడు
రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధికోసం కలసి పనిచేద్దామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు తాను చెప్పినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎక్కువ సమయం అభివృద్ధికే కేటాయించాలని తనవంతుగా సలహా ఇచ్చానన్నారు. రెండు రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలనే విభజన జరిగిందన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ తో భేటీ అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. కేంద్ర నిధులతో రెండు రాష్ట్రాలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణలో అమలవుతున్న కేంద్ర పథకాల ప్రగతిపై సీఎంలకు నోట్ ఇచ్చినట్లు వెల్లడించారు. అంతేగాక ఏపీ, తెలంగాణలో ప్రాజెక్టులు, నిధులపై నివేదిక కోరానని త్వరలో వాటిని తీసుకుని రెండు రాష్ట్ర కార్యదర్శులు ఢిల్లీకి రావాలని చెప్పానన్నారు. ఢిల్లీలో తమ కార్యదర్శులతో నివేదికలపై చర్చించి సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.